Online Puja Services

కడుపునెప్పి వైదీశ్వరునికి వెళ్లింది

3.17.150.163

కడుపునెప్పి వైదీశ్వరునికి వెళ్లింది

తాము పరమేశ్వరుని అవతారమని పరమాచార్య స్వామివారు బయటపెట్టకపోయినప్పటికీ, భక్తుల బాధలను చూసి కరుణతో వారిని అనుగ్రహించిన విధానం చూస్తే అది మనకు అర్థం అవుతుంది. మహాస్వామి వారిని సేవించుకుని జన్మ ధన్యతను పొందిన అంతేవాసులలో శ్రీ బాలు మామ ఇటువంటి సంఘటనలను ఎన్నింటినో కళ్ళారా చూశాడు.

ఒకసారి ముప్పైనాలుగేళ్ల భక్తులొకరు తల్లితండ్రులతో కలిసి తిరునల్వేలి నుండి కంచి మఠానికి వచ్చాడు. చాలా బాధలో ఉన్నాడు ఆ భక్తుడు. వారు ఏం చెయ్యాలో పాలుపోక అందరితో కలవకుండా ప్రత్యేకంగా నిలబడున్నారు. వారు ఇదే మొదటిసారి కంచి మఠానికి రావడం అని తెలుస్తోంది. వారు బహుశా శృంగేరి శ్రీమఠానికి చెందినవారనుకుంటాను.

మహాస్వామివారు వారిని చూసి, దగ్గరకు రమ్మన్నారు. వారు స్వామివారి దగ్గరికు రాగానే, బాధ తట్టుకోలేక ఏడ్చేశారు.

“మేము శృంగేరి శ్రీమఠం నుండి వచ్చాము. నేను దీర్ఘకాలిక కడుపునెప్పితో బాధపడుతున్నాను. ఎంతోమంది వైద్యులను సంప్రదించాము కానీ ఎటువంటి గుణం లేదు. మా గురువుగారిని దర్శించుకోవడానికి శృంగేరి వెళ్ళగా, మీరు వైదీశ్వర్యులని వారు మమ్ములను ఇక్కడకు పంపారు. మేము ఇక్కడకు రావడానీ కారణం ఇదే” అని స్వామివారికి చెప్పారు.

“వారు అలా చెప్పారా?” అని అడిగారు స్వామివారు తమకు ఏమీ తెలియనట్టు. అతడికి కాస్త ఓదార్పు కలిగి, పరమాచార్య స్వామివారికి సంపూర్ణ శరణాగతి చేస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు.

“మీ ఆశీస్సులను పొంది నా వ్యాధిని పోగొట్టుకోవడానికి నేను మీవద్దకు వచ్చాను. ఈ బాధనుండి కేవలం పరమాచార్య స్వామివారే నన్ను కాపాడాలి. జీవితాంతం నేను ఈ కడుపునెప్పితోనే బ్రతకాల్సివస్తే, ఇక్కడే ఇప్పుడే నా జీవితాన్ని త్యజించడం ఉత్తమం. స్వామివారు నన్ను కాపాడాలి” అని వేడుకున్నాడు ఆ భక్తుడు.

స్వామివారు తమ కరుణ నిండిన చూపులతో ఆ భక్తుడిని చూశారు. తరువాత కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లారు. బాలు మామతో బాటు ఇతర భక్తులు కూడా తరువాత ఏం జరుగుతుందా అని చూస్తున్నారు.

కొద్దిసేపటి తరువాత, స్వామివారు మెల్లిగా కళ్ళు తెరిచి ఆ భక్తుణ్ణి చూశారు. అదే సమయంలోనే అతడి కడుపునెప్పి మాయం అయ్యింది. ఈ విషయం అతడి కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది. “పరమాచార్యా, వైదీశ్వరా!!!, ఆ నెప్పి అంతా ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావడం లేదు” అని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు.

కానీ ఆరోజు నుండి పరమాచార్య స్వామివారు కడుపునెప్పితో బాధపడుతున్నట్టు బాలు మామతో పాటు అందరికీ అనిపించసాగింది. స్వామివారి భిక్ష చూసుకునేది బాలు మామ కాబట్టి ఈ విషయాన్ని కూడా తానే చూసుకోవాలనుకున్నాడు. సాక్షాత్ భగవంతుడే బాధను అనుభవిస్తూవుంటే ఎక్కడికి వెళ్ళి ఎవరిని ప్రార్థించగలడు? తమ కులదైవమైన వైదీశ్వరుని దేవాలయానికి వెళ్ళి పరమాచార్య స్వామివారి కోసం ప్రార్థించాలని నిశ్చయించుకున్నాడు. మరుసటిరోజు ఏకాదశి కావడంతో, స్వామివారు ఎలాగూ భిక్ష తీసుకోరు కాబట్టి ఆరోజు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.

అది అలాగే స్వామివారికి చెప్పలేడు కాబట్టి, వైదీశ్వర దేవాలయానికి వెళ్లాలని ఉందని చెప్పాడు. “నువ్వు ఎప్పుడూ పరమాచార్య స్వామివారే వైదీశ్వరన్ అని అంటుంటావు, కానీ అక్కడకి వెళ్తాను అంటున్నావు” అని తమ స్వస్వరూపాన్ని తెలియజేస్తూ బాలు మామని అడిగారు.

స్వామివారి అనుమతి తీసుకోవాలి కాబట్టి, “నా చిన్నప్పుడు పుట్టువెంట్రుకలు ఇవ్వడానికి వెళ్ళినదే, మరలా ఆ దేవాలయాన్ని దర్శించలేదు కనుక వెళ్లివస్తాను” అని చెప్పాడు.

స్వామివారి ఆశీస్సులు అందుకుని బాలు మామ వైదీశ్వరన్ దేవాలయం చేరుకున్నాడు. వైదీశ్వరుని ప్రార్థించేవారు, సాధారణంగా వెండి శరీర అవయవాలు(చేతులు, కాళ్ళు మొదలైనవి) మొక్కుకుని సమర్పిస్తారు. బాలు మామ స్వామివారి కడుపు కోసం ప్రార్థిస్తున్నాడు కాబట్టి, వెండి కడుపు భాగం సమర్పించాలని చూస్తున్నాడు కానీ అది ఏ దుకాణంలోనూ లభించడంలేదు.

ఒక వృద్ధురాలు బాలు మామను సమీపించి, “వెండి కడుపు భాగం కోసం వెతుకుతున్నావు కదా, అది అంగళ్లలో దొరకదు. దేవాలయ కార్యాలయంలో మాత్రమే దొరుకుతుంది. వారు కేవలం ముఖ్య వ్యక్తులకు మాత్రమే ఇస్తారు” అని చెప్పి వెళ్లిపోయింది. తనకు కావలసిన సమాచారం ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా లభించడం బాలు మామని ఆశ్చర్యానికి గురిచేసింది.

కార్యాలయం వద్దకు వెళ్ళాడు బాలు మామ. తను కంచి శ్రీమఠం నుండి వచ్చానని, పరమాచార్య స్వామివారి కోసం శ్రీ వైదీశ్వరునికి వెండి కడుపు భాగం సమర్పించాలనుకుంటున్నానని చెప్పడానికి అవకాశం లేదు. ఒక సాధారణ వ్యక్తిలా దేవాలయ కార్యనిరహణాధికారిని కలిసాడు. అతనితో మాట్లాడగానే, తాము చిన్నప్పుడు మన్నారుగుడి పాఠశాలలో కలిసి చదువుకున్నారని బాలు మామకు అవగతమైంది.

ఆ అధికారి వెండి కడుపు భాగం ఇవ్వడానికి అంగీకరించాడు. బాలు మామ 750 రూపాయలు ఇచ్చి సంతోషంగా తీసుకున్నాడు. మనస్ఫూర్తిగా వైదీశ్వరుణ్ణి ప్రార్థించి, కార్యాలయంలో తీసుకున్న వెండి కడుపు భాగాన్ని పరమేశ్వరునికి సమర్పించాడు.

బాలు మామ కాంచీపురం చేరుకోగానే, మహాస్వామివారి కడుపునెప్పి పూర్తిగా తగ్గిపోయి, చాలా సంతోషంతో ఆనంద నటరాజ స్వామిలా కాంతులీనుతున్నారు. “మహాస్వామివారి అనుగ్రహంతో అద్భుతంగా వైదీశ్వరుని దర్శనం చేసుకున్నాను” అని బాలు మామ స్వామివారితో చెప్పాడు.
మహాస్వామి వారు బాలుమామ వైపు నవ్వుతూ చూసి, “నువ్వు వెళ్ళి నా కడుపునెప్పిని వైదీశ్వరునికి ఇచ్చి వచ్చావా?” అని అడిగారు.

బాలు మామ ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్థమైంది ఆ భక్తుడి కడుపునెప్పి స్వామివారికి ఎలా వచ్చిందో, స్వామివారి నుండి అది వైదీశ్వరునికి ఎలా వెళ్ళిందో. ఈ సంఘటనతో మహాస్వామివారి అవ్యాజ కరుణ ఎటువంటిదో బాలు మామ అర్థం చేసుకున్నారు.

మనస్పూర్తిగా పరమాచార్య స్వామివారికి మనం శరణాగతి చేస్తే, ప్రపంచంలోని సర్వ శుభములు మంగళములు మనకు సొంతమవుతాయి.

--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Kanchi Kamakoti, Chandrasekharendra Saraswati, Chandrasekhara, saraswathi, saraswati, Paramacharya, Periyava, 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore